CM Chandrababu: వైసీపీ పాలనలో ఆర్థిక పరిస్థితి దారుణం 1 y ago
AP : సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన టీడీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కష్టాల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్‌ను అందిస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ రూపకల్పన చేశామని చెప్పారు. వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారన్నారు. ఈ బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే అని పేర్కొన్నారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే పని తీరులో మార్పు రావాలన్నారు. మళ్లీ సభకు రావాలనే భావనతో ఎమ్మెల్యేల పని తీరుండాలని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు మధ్య సమన్వయం ఉండాలని తెలిపారు. ఎక్కడా విభేదాలకు తావులేకుండా.. గ్రూపులుగా ఏర్పడకుండా అందరూ కలిసి ముందుకెళ్లాలని చెప్పారు.
ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచి అసెంబ్లీకి రావాలంటే పట్టుదలతో ఈరోజు నుంచే పని చేయాలన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నా జాగ్రత్తగా ముందుకెళుతున్నామని చెప్పారు. అందరి పని తీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నానని తెలిపారు. త్వరలో ఒక్కొక్కరితో మాట్లాడతానని పేర్కొన్నారు.